- కడియం గతంలో ఏం చేశారు..ఇప్పుడు జిల్లా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది?
- జనగామ జిల్లా కోసం పోరాడింది ప్రజలే..అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- కేసీఆర్ హయాంలోనే కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఆసుపత్రులు
- రైతులకు సాగునీరు, విద్యుత్ అందించాలి.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
- కడియం శ్రీహరి అయినా..ఇతర నాయకులైనా సర్పంచులు, కౌన్సి లర్లను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోం
- మూడు నెలల్లో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం
- హామీలు అమలు చేయకపోతే ప్రజ లే బుద్ధి చెబుతారు
- జనగామ జిల్లా ఆవిర్భావ దశాబ్ది సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్
జనగామ:
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జనగామ జిల్లా ఏర్పడి పదేళ్లు(Jangaon District Formation) పూర్తయిన సందర్భంగా ఆదివారం జనగామలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వ హించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యం లో చంపక్ హిల్స్ సమీపంలో, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ వద్ద, మాజీ మంత్రి డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో పాలాభిషేక కార్యక్రమాలు చేపట్టారు. అనంత రం నెహ్రూ పార్కు నుంచి ర్యాలీగా బయలుదేరి, జనగామ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- జనగామ జిల్లాను అనేక పోరాటాలు చేసి సాధించుకున్నాం అలాంటి జిల్లాను రద్దు చేయాలని లేదా దాని ప్రాధాన్యాన్ని తగ్గించాలని ఎవరైనా కుట్రలు చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. జనగామ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
- బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జనగామ ప్రాంతంలో రహదారులను విస్తరించి, డబుల్ రోడ్లను ఫోర్లేన్ రోడ్లుగా అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని పల్లా గుర్తుచేశారు. సూర్యాపేట రోడ్డు నుంచి సిద్ధిపేట రోడ్డు వరకు, జనగామ నుంచి హైదరాబాద్, హనుమకొండ వైపు వెళ్లే రహదారులను విస్తరించామని తెలిపారు.
- గతంలో కలెక్టరేట్ పనుల కోసం హనుమకొండకు వెళ్లాల్సి వచ్చేదని, జిల్లా ఏర్పాటుతో కలెక్టరేట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. తరిగొప్పుల, చిల్పూరు మండలాల ఏర్పాటు, స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజన్ సాధనతో పరిపాలన ప్రజలకు చేరువైందన్నారు. జనగామ జిల్లాతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పెద్ద ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి వంటి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
- జనగామ జిల్లా ఏర్పాటుతో ఏం వచ్చిందని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం సరికాదన్నారు. గతంలో జిల్లా ఏర్పాటును వ్యతిరేకించిన కడియం శ్రీహరి ఇప్పుడు జిల్లా ను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలను తిరిగి ఒక్కటి గా చేయాలనే ఆలోచనలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్నాయ ని విమర్శించారు. జనగామ జిల్లాతో పాటు మెడికల్, నర్సిం గ్ కాలేజీలు వచ్చినందుకే ఈ ప్రాంతంపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారా అని ప్రశ్నించారు.
- జనగామ జిల్లా సాధన వెనుక సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉందని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిం చిందన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న వంటి పోరాట యోధుల చరిత్రను ప్రస్తావించారు. జనగామ ప్రాంతానికి పోరాట స్ఫూర్తి వారసత్వంగా వచ్చిందని పేర్కొన్నారు.
- జనగామ జిల్లా కోసం ప్రజలు ఉద్యమించి, అనేక కష్టాలు ఎదుర్కొని సాధించుకున్నారని చెప్పారు. జిల్లా అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసా రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి సహా జిల్లా విషయంలో వ్యతిరేకం గా వ్యవహరిస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
- దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడంలో ఎవరి పాత్ర ఎంత ఉందో ప్రజలకు తెలుసని పల్లా అన్నారు. గతం లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, ఏ నాయకులు ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతానికి ఎంత సాగునీరు అందించారో వివరించాలని ప్రశ్నించారు.
- 2004, 2009లో కాంగ్రెస్, 2014, 2018లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దేవాదుల నీళ్లను తానే తీసుకొచ్చానని కడియం శ్రీహరి పదేపదే చెప్పడం సరికాదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సుమారు 50 వేల ఎకరా లకు సాగునీరు అందించే ప్రణాళిక ఉండగా, 48 వేల ఎకరా లకు నీరు అందిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, మరో రెండు లక్షల ఎకరాలకు నీరందించేం దుకు నిధులు కేటాయించి రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. చీటకోడూరు, బొమ్మకూరు ప్రాంతాల వరకు సాగునీటిని తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.
- కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాల్వలు నిర్మించడం, చెరువు లను అభివృద్ధి చేయడం, రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, పంపులు, మోటార్లు, సబ్స్టేషన్లు నిర్మించడం వంటి పనులు చేపట్టామని తెలిపారు. సమైక్య పాలనలో సాగునీరు అంద ని పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రాజెక్టులు నిర్మిం చి, నీటిని ఎత్తిపోసేందుకు పది మోటార్లు, సుమారు 48 కిలోమీటర్ల టన్నెల్ వంటి నిర్మాణాలు చేపట్టామని పేర్కొ న్నారు. రావులపల్లి ఉనికి చెరువు వరకు నీటిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేశామని వివరించారు.
- ఇన్ని నిర్మాణాలు చేసినప్పటికీ ప్రస్తుతం విద్యుత్ సరఫరా లేక నీటిని ఎత్తిపోసుకోలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు స్పందించడం లేదని ఆరోపించారు. గత మూడేళ్లలో సాగునీటి సమస్యపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు.
- సాగునీరు, విద్యుత్ అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి మిగిలిన పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని సూచించారు.
- అవసరమైతే విద్యుత్ కొనుగోలు చేసి, అందుబాటులో ఉన్న నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసి జనగామ ప్రాంతంలోని రిజర్వాయర్లను వినియోగంలోకి తీసుకురా వాలని అన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకొని రైతులకు మేలు చేయాలని సూచించారు.
- ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న జనగామను సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, ఆ ఆగ్రహ మే ప్రభుత్వ పతనానికి కారణమవుతుందని హెచ్చరించారు.
- ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు, మద్యం సీసాలు, చీరలు పంపిణీ చేసి ఓట్లు సాధించిందని పల్లా ఆరోపించారు. ఒక్కో ఓటరుకు రూ.2,000 చొప్పున ఇచ్చారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు డబ్బు తీసుకున్నప్పటికీ, ప్రభు త్వంపై తమ అసంతృప్తిని ఓటు ద్వారా వ్యక్తం చేశారని అన్నారు.
- కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇస్తూ తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడం, వారి ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
- సర్పంచులు, కౌన్సిలర్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో ప్రజలు ఓట్లు వేశారని పల్లా అన్నారు. అయితే మూడేళ్లు గడిచినా రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, విద్యుత్ వంటి అంశాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
- స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను బెదిరించి తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పల్లా ఆరోపించారు. ఇలాంటి ఒత్తిళ్లకు గురవుతున్న ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
- సర్పంచుల ఎన్నికల తర్వాత గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను గుర్తిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు ఉన్న గ్రామాల్లో అభివృద్ధి జరగకపోతే, పార్టీ తరఫున దగ్గరుండి మూడు నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన ఎమ్మెల్యేలు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు బెదిరింపులకు భయపడకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.
- బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ బెదిరింపులకు భయపడదని పల్లా స్పష్టం చేశారు. 2001 నుంచి 2014 వరకు ఎన్నో పోరాటాలు చేశామని, అనేక మంది కార్యకర్తలు జైళ్లకు వెళ్లారని, ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. అనేక ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం తమకు ఉందని, ఎన్నికలకు ముందు, తర్వాత రాజకీయంగా ఎలా వ్యవహరించాలో తెలుసునని అన్నా రు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను బెదిరించే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.
- కడియం శ్రీహరి అయినా, ఇతర నాయకులైనా సర్పంచులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని పల్లా స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను భయపెట్టాలని చూస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
- జనగామ జిల్లా ఏర్పాటుతో వచ్చిన ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పల్లా అన్నారు. జిల్లా కోసం పోరాడిన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న జిల్లాను రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయాలని చూస్తే జనగామ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
- తెలంగాణ ఉద్యమం నుంచి జనగామ ప్రాంతం రాష్ట్రానికి అండగా నిలిచిందని పల్లా అన్నారు. భవిష్యత్తులోనూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిలబడుతుందని చెప్పారు. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడం, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
- ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ, స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ పాలన సాగిస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

















