- రాళ్లలో రాసిన రాజ్యాల కథ.. సిద్దులగుట్టలో చరిత్ర అడుగుజాడలు
- వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యం..సిద్దులగుట్ట, ఓబుల్‌కేశ్వాపూర్ ప్రత్యేక కథనం
- శిలల్లో శాసనాలు..నేలలో నాగరికత..బచ్చన్నపేటలో అరుదైన చారిత్రక క్షేత్రాలు
పల్లా టైమ్స్ స్పెషల్ స్టోరీ:
తెలంగాణ నేలపై కాకతీయ రాజవంశం వైభవాన్ని చెప్పే కోటలు, దేవా లయాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని ప్రదే శాలు మాత్రం ఇంకా చరిత్ర పుస్తకాల అంచుల్లోనే మిగిలి పోయాయి. బచ్చన్నపేట పరిధిలోని సిద్దులగుట్ట, సమీప ఓబుల్‌కేశ్వాపూర్ అలాంటి అరుదైన చారిత్రక క్షేత్రాలు. ఒకప్పుడు మెదక్ జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం, ప్రస్తు తం వరంగల్ జిల్లాలో చరిత్రను మోస్తోంది. ఒక్కసారి అడు గు పెడితే…రాళ్లు మాట్లాడుతున్నట్టూ, శిలలు కథలు చెబుతున్నట్టూ అనిపించే ప్రదేశాలు ఇవి.
సిద్దేశ్వర ఆలయం వెనుక పురాణ గాథ:
సిద్దులగుట్ట పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ప్రాచీన సిద్దేశ్వర ఆల యం. కొండపై ఎన్నో దేవాలయాలు ఉన్నా, స్వయంభువుగా వెలసిన సిద్దేశ్వరలింగం కారణంగానే ఈ ప్రాంతం “సిద్దులగుట్ట”గా ప్రసిద్ధి చెందింది.
సిద్ధుల తపస్సు..జైనుల ఆనవాళ్లు:
మత్స్యేంద్రనాథ్, గోరక్‌నాథ్, కనిక్‌నాథ్ వంటి యోగులు ఈ ప్రాంతంలో సాధన చేశారనే స్థానిక కథనాలు ఉన్నాయి. చరి త్రకారుల అంచనాల ప్రకారం 8వ–9వ శతాబ్దాల్లో సిద్ధులు, జైన తీర్థంకరులు ఇక్కడ నివసించినట్లు ఆధారాలు చెబుతున్నాయి.

రాళ్లపై చెక్కిన శిల్పకళ:
కొండపైకి ఎక్కితే నంది మండపం, శిలాతోరణం, సొరంగ మార్గం అవశేషాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. నల్ల గ్రానైట్‌పై చెక్కిన శిల్పాలు 11వ నుంచి 13వ శతాబ్దాల కళా వైభవాన్ని గుర్తు చేస్తాయి. ధ్వంసమైన రెండు శిలాశాసనాల ఆనవాళ్లు కనిపిస్తుండగా, వాటిని దండయాత్రల కాలంలో ధ్వంసం చేశారనే స్థానిక చరిత్ర వినిపిస్తుంది.
కొడవటూరులో చరిత్ర ఆనవాళ్లు:
కొడవటూరు గ్రామంలో భద్రకాళి ఆలయం, వినాయక ఆలయం, త్రికూటాలయం ఇప్పటికీ చరిత్రకు నిలువెత్తు నిదర్శనాలు. గ్రామం పక్కనున్న కొండల్లో పాండవుల సంచారం జరిగినట్లు స్థానికులు చెబుతారు. సిద్దులగుట్ట పైభాగాన ఇటీవల దత్తాత్రేయ ఆలయం నిర్మించబడినా, ఈ నేల గుండెలో దాగి ఉన్న అసలు కథ మరింత లోతైనది.
ఓబుల్‌కేశ్వాపూర్‌లో త్రిమత శాసనం:
ఓబుల్‌కేశ్వాపూర్ కథ మరింత ఆసక్తికరం. 990 సంవ త్సరం నుంచే గ్రామం ఉన్నట్లు స్థానిక చరిత్రకారులు చెబు తున్నారు. ఒకప్పుడు ఇది సాధకుల, సిద్ధుల, శ్రీవైష్ణవ సంప్రదాయేతరుల సంచార భూమిగా నిలిచింది.
కేశవనాథుడు..ఓబన్న పేర్ల జాడ:
కేశవనాథుడు, ఓబన్న పేర్లతోనే గ్రామానికి ఓబుల్‌కేశ్వాపూర్ పేరు వచ్చిందని స్థానిక కథనం. గ్రామంలో చెరువు కట్టపై ఉన్న ఆరు అడుగుల శిలాశాసనం ప్రత్యేక ఆకర్షణ. శాసనం పైభాగంలో విష్ణు మూర్తి, శివలింగం, జైన తీర్థంకరుల శిల్పా లు చెక్కబడి ఉండటం ఈ ప్రాంతంలో మూడు మతాల సహజీవనానికి నిదర్శనం. కళ్యాణి చాళుక్యులు కాలం నాటి త్రిమత శాసనంగా దీన్ని చరిత్రకారులు గుర్తిస్తున్నా రు.
మట్టిదిబ్బల్లో దాగిన నాగరికత:
గ్రామంలోని పాత హనుమాన్ దేవాలయం, రామలక్ష్మణ పాదుకల స్థలం, రెండు ప్రాచీన మట్టిదిబ్బలు, శిథిలమైన కోట ఇప్పటికీ కాలానికి సాక్షులుగా నిలిచాయి. శిఖరాగ్ర ధ్వజస్తంభాలు జైన, శైవ, వైష్ణవ సంప్ర దాయాల ప్రతీకలుగా కనిపిస్తాయి. ఈ మట్టిదిబ్బలపై శాస్త్రీయ తవ్వకాలు జరిగితే తెలంగాణ చరిత్రలో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
వెలికితీస్తే తెలంగాణ చరిత్రకు కొత్త అధ్యాయం:
చరిత్రను వెతికేవారికి, శిల్పకళను ఆస్వాదించేవారికి, పురాతన నాగరికత ఆనవాళ్లను తెలుసుకోవాలనుకునేవా రికి సిద్దులగుట్ట ఓబుల్‌కేశ్వాపూర్ ఒక అద్భుత యాత్ర. అభివృద్ధి దూరంగా ఉన్నా, ఈ నేల గుండెలో వేల ఏళ్ల కథలు నిద్రపోతున్నాయి. వెలికితీస్తే తెలంగాణ చరిత్రకు మరో వైభవం జతకానుంది.
-పల్లా టైమ్స్ ప్రత్యేక కథనం















