- తెలంగాణ యుద్ధం నా వంతు..జగిత్యాల యుద్ధం ప్రజల వంతు
- గుండె ధైర్యం ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి
- జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ మరింత బలపాటు
- జీవన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
- తెలంగాణ అంతటా జీవన్ రెడ్డి పర్యటన
- మిషన్ కాకతీయే తొలి సంస్కరణ
- మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ?
- రైతుబంధు, యూరియా, నీళ్లలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం
- కాంగ్రెస్ పోవాలి…బీఆర్ఎస్ రావాలి
- హైడ్రా మొదటి సంతకంతోనే రద్దు
- మూసీ పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు వద్దు
- తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల నుంచే
బిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు
జగిత్యాల:
జగిత్యాలలో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు(BRS chief K. Chandrasekhar Rao at the public blessing meeting)సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేసీఆర్, జీవన్ రెడ్డి నాయ కత్వం, ధైర్యం, ప్రజాదరణపై ప్రశంసల జల్లు కురిపించారు.
చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది…గుండె ధైర్యం ఉంటే అదే నీ వెంట పెద్ద సైన్యమై నడుస్తుందని ఈ ప్రాంతానికి చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ మాటలను కేసీఆర్ గుర్తు చేశారు. జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్న నాయకుడని, ఆయన గురించి ఎక్కు వగా చెప్పితే మేమే మమ్మల్ని డబ్బా కొట్టుకున్నట్టవుతుంద న్నారు. తాను జీవన్ రెడ్డికి మంచి స్నేహితుడినని, పార్టీలు వేరైనా కలిసి పనిచేశామని తెలిపారు. జగిత్యాల ప్రజల దీవెనలతో జీవన్ రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలి చారని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలంతటా ఆయనకు విశేషమైన అభిమాన వర్గం ఉందన్నారు. జగి త్యాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన నాయకుడ ని ప్రశంసించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే పార్టీ కి లాభనష్టాలపై సర్వేలు వచ్చాయని, ఆ సర్వేల్లో బీఆర్ఎస్ కు లాభమే జరుగుతుందని తేలిందన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను గెలిపించారని, జీవన్ రెడ్డికి పదవులు కొత్తవి కావ ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేర డం కుటుంబ సభ్యుల్లా కలిసినట్టేనని పేర్కొన్నారు. పార్టీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాం:
ఉమ్మడి కరీంనగర్ మాత్రమే కాదు…పార్టీ బలోపేతం కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం జీవన్ రెడ్డి పర్యటిస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరు నూరైనా…వందకు వంద శాతం…మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జీవన్ రెడ్డి కి తగిన, గౌరవప్రదమైన మంచి పదవి ఖాయమని పేర్కొ న్నారు. ఇక నుంచి జగిత్యాల యుద్ధం జగిత్యాల ప్రజల వంతు అయితే…తెలంగాణ యుద్ధం తన వంతని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో తెలంగాణకు జరుగు తున్న అన్యాయాన్ని చూసి రోజూ మనసు చలించిపోయే దని గుర్తుచేశారు. అసెంబ్లీలో తెలంగాణ మాట మాట్లాడొద్ద ని భయంకరమైన దాడులు చేసేవారని తెలిపారు.మెట్‌పల్లి ప్రాంత ప్రజలు దుబాయ్, బొంబాయి వలస వెళ్లేవారని, పాలమూరు ప్రాంతంలో నూటి కి నూరు శాతం వలసలే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితి వచ్చినప్పుడు గుండె రగిలిపో యిందని అన్నారు. అప్పట్లో తెలం గాణ కోసం మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదని చెప్పారు.చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచితే తగ్గించమని తాను లేఖ రాశానని, కరెంట్ ఛార్జీలపై ప్రజలు రోడ్లపైకి వస్తే బషీర్‌బాగ్‌లో మిట్ట మధ్యాహ్నం ప్రజలను పిట్టల్లా కాల్చేశారని, ఆ దృశ్యం చూసి తన మనసు పూర్తిగా తిరుగుబాటు దిశగా మళ్లిందని వెల్లడించారు. తెలంగాణ కోసం బయలు దేరిన తనను చాలా మంది అవమానించారని, అయినా వాటన్నింటిని తట్టుకుని చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా మని భావోద్వేగంగా తెలిపారు.
తెలంగాణ తొలి కార్యక్రమం మిషన్ కాకతీయే:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ అని కేసీఆర్ తెలిపారు. చెరువులు బాగు చేస్తే వాటి కింద ఉన్న పొలాలు పచ్చగా పండుతాయన్న ఆలోచనతోనే మిషన్ కాకతీయ ప్రారంభించామన్నారు.ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగనని అసెంబ్లీ సాక్షిగా చెప్పానని గుర్తు చేశారు. ఐదేళ్ల పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చామని, ఇప్పుడు ఆ నీళ్లు ఎందుకు రావడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.రైతుబంధును నెలకు ఒకసారి వేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని, యూరియా బస్తాల కోసం రైతులు యాప్‌లు పట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల కోసం రూ.75 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు.రాష్ట్ర ఆదాయం పూర్తిగా దిగజారిపోయిందని, కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండేదని, ఇప్పుడు భూమి అమ్మేవాళ్లు ఉన్నా కొనేవాళ్లు లేని పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని మండిపడ్డారు.
జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత నోటితోనే కాంగ్రెస్ పోవాలి…బీఆర్ఎస్ రావాలి:
జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత నోటి నుంచే కాంగ్రెస్ పోవాలి…బీఆర్ఎస్ రావాలి అనే మాట వచ్చిందని కేసీఆర్ అన్నారు. హైడ్రాను తెచ్చారని, నిజామాబాద్‌కు నీడ్రా, జగి త్యాలకు జీడ్రా తెస్తామని అంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మొదటి సంతకంతో హైడ్రాను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చవద్దని హెచ్చరిం చారు. మూసీ ప్రాజెక్టు ప్రజల కోసమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ మొదలవ్వాల్సిందేనని, ఈ యజ్ఞం జగిత్యాల జైత్రయాత్ర నుంచే ప్రారంభమవుతుందని కేసీఆర్ ప్రకటించారు. ఇదే బీఆర్ఎస్ బలమని పేర్కొ న్నారు.

















